Srinivas Goud | హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పోకో మార్షల్ ఆర్ట్స్ టీమ్‌కు చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు క్రీడాకారులను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను కనబరుస్తూ పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారని కొనియాడారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత విద్యలో రిజర్వేషన్లను అందిస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల క్రీడా ప్రాంగణాలను నిర్మించామని తెలిపారు. క్రీడలలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన క్రీడాకారులకు విలువైన ప్రాంతాలలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను, నగదు ప్రోత్సాహకాలను అందిస్తుందని మంత్రి చెప్పారు.
65 కేజీల విభాగంలో సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ గోల్డ్ మెడల్, 60 కేజీల విభాగంలో మహమ్మద్ పతే అలీ గోల్డ్ మెడల్,
55 కేజీల విభాగంలో సహెద ఫరీద సుల్తానా రజతం, 57 కేజీల విభాగంలో సహెద సుల్తానా కాంస్య పతకాలను సాధించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోచ్, పోకో అకాడమీ డైరెక్టర్ మాస్టర్ సయ్యద్ ఇఫ్టేక్వార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.