హైదరాబాద్ : ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ – 22 పోటీలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అబుదాబిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగే ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ -22 పోటీలకు రాష్ట్రం నుంచి నలుగురు క్రీడాకారులు ఆర్ ఆశ్విని, ఆర్ కీర్తి, ఏ సంజయ్ రెడ్డి ఎంపికయ్యారు. వీరు లేసర్ 4.7 విభాగంలో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ ముగ్గురు క్రీడాకారులు హాకీంపేట్లోని రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందినవారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి , ప్రోత్సాహకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడ మౌలిక సదుపాయాల కల్పనకు క్రీడా మైదానాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నామన్నారు. క్రీడలలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడాకారులు రాణించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో వివిధ క్రీడాంశాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పాల్గొనేలా కార్యాచరణను రూపొందించాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.