హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్ మెరువాలనే ఉద్దేశంతో నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చామని ఆయన అన్నారు. మంగళవారం నిజాంపేట సమతానగర్‌లో ఎస్ఎల్వీ ప్రొ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు క్రికెట్‌ను మాత్రమే క్రీడగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పువచ్చింది. తల్లిదండ్రుల ఆలోచన విధానం మారింది. హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకు వచ్చేది. ఇప్పుడు బిర్యానీతో పాటు బ్యాడ్మింటన్ చేరిపోయింది.
గోపీచంద్, సింధు, సైనా, సాత్విక్‌సాయిరాజ్ లాంటి ప్లేయర్లు హైదరాబాద్ నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటూ చాలా మంది చిన్నారులు బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.