హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన యువ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. స్పెయిన్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లోహ్ కీన్ యె (సింగపూర్) చేతిలో పోరాడి ఓడిన శ్రీకాంత్ రజతం గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘అద్భుత ప్రదర్శనతో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రజతం దక్కించుకున్న శ్రీకాంత్‌కు అభినందనలు. భవిష్యత్‌లోనూ భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలని అభిలషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు శ్రీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ టోర్నీలో రజతం సాధించిన తొలి భారత షట్లర్‌గా శ్రీకాంత్ సాధించిన ఘనత రాష్ట్రంతో పాటు దేశం మొత్తం గర్విస్తుందన్నారు.