లివర్‌పూల్ : ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ చూపించారు. ఆదివారం ముగిసిన మెగాటోర్నీలో జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా పసిడి పతకాలతో కొత్త చరిత్ర లిఖించగా, నుపుర్ షెరాన్‌కు రజతం, పూజారాణి కాంస్య పతకాలతో మెరిశారు. విదేశీ గడ్డపై భారత మహిళా బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల 57కిలోల ఫైనల్ బౌట్లో జైస్మిన్ 4-1 తేడాతో జులియా సెజెరెమెటా(పోలాండ్)పై అద్భుత విజయం సాధించింది. మెగాటోర్నీలో ఆది నుంచి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన జైస్మిన్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. పోలాండ్ బాక్సర్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా పవర్ఫుల్ పంచ్‌లతో చెలరేగుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మహిళల 48కిలోల తుదిపోరులో మీనాక్షి 4-1 తేడాతో నజిమ్ కిజ్బె(కజకిస్థాన్)పై విజయంతో పసిడి పతకాన్ని ముద్దాడింది.
అంచనాల్లేకుండా బరిలోకి దిగిన మీనాక్షి తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. గత జూలైలో కజికిస్థాన్ బాక్సర్ చేతిలో ఎదురైన ఓటమికి మీనాక్షి తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. మెగాటోర్నీలో పసిడి పతకాలు గెలువడం ద్వారా మేరీకోమ్, నిఖత్ జరీన్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై సరసన జైస్మిన్, మీనాక్షి నిలిచారు. ఇదిలా ఉంటే 80+కిలోల ఫైనల్ బౌట్లో నుపుర్ 2-3 తేడాతో అగాట కాక్మార్స్(పోలాండ్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మహిళల 80కిలోల సెమీస్‌లో పూజారాణి 1-4 తేడాతో ఎమిలీ అస్కిత్(బ్రిటన్) చేతిలో ఓడి కాంస్యం ఖాతాలో వేసుకుంది. మొత్తంగా పురుషులు నిరాశపరిచిన చోట మహిళలు తమ సత్తా ఏంటో చూపెట్టారు.