టెక్సాస్: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్(Mike Tyson vs Jake Paul) మళ్లీ రింగులోకి దిగుతున్నాడు. మాజీ హెవీవెయిట్ చాంపియన్.. సుమారు 19 ఏళ్ల బ్రేక్ తర్వాత బిగ్ ఫైట్‌కు రెఢీ అవుతున్నాడు. యూట్యూబర్, యువ బాక్సర్ జేక్ పౌల్‌తో .. హెవి వెయిట్ బౌట్లో పాల్గొననున్నాడు. అమెరికాలోని టెక్సాస్‌లో ఇవాళ ఈ మ్యాచ్ జరగనున్నది. వాస్తవానికి జూలై 20వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను.. టైసన్‌కు అల్సర్ వల్ల మ్యాచ్‌ను వాయిదా వేశారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఇంట్రెస్టింగ్గా మారింది. మైక్ టైసన్ 58 ఏళ్లు కాగా, పౌల్ వయసు 27 ఏళ్లు మాత్రమే.
బాక్సర్ మైక్ టైసన్ కెరీర్లో ఈ ఫైట్ ప్రత్యేకం కానున్నది. 2005లో కెవిన్ మెక్బ్రౌడ్ చేతిలో ఓడిన టైసన్ ఆ తర్వాత రిటైర్ అయ్యారు. ఆ మ్యాచ్ జరిగి 19 ఏళ్లు అవుతుంది. అంత భారీ గ్యాప్ తర్వాత టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించనున్నారు. 1986లోనే 20 ఏళ్ల వయసులోనే టైసన్ ప్రపంచ హెవీ వెయిట్ టైటిల్‌ను గెలిచాడు. టైసన్ ఖాతాలో 88 శాతం విన్నింగ్ రికార్డు ఉన్నది. 58 ప్రొఫెషనల్ బౌట్లలో పాల్గొన్న అతను.. 50 మ్యాచ్‌లను నెగ్గాడు. ఐరన్ మైక్‌గా కీర్తిగాంచిన టైసన్ ఈ మ్యాచ్‌లో మరో క్లాసిక్ విజయాన్ని నమోదు చేసుకుంటాడని భావిస్తున్నారు.
జేక్ పౌల్ రికార్డు కూడా సూపర్‌గా ఉంది. అతను 2018 నుంచి రింగ్‌లో కింగే. అతని రికార్డు 10-1గా ఉన్నది. పంచ్ పవర్ విషయంలో పౌల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. గత ఏడాది ముగ్గురిపై అతను ఈజీగా విక్టరీ కొట్టాడు. ఓపెనింగ్ రౌండ్లలోనే ప్రత్యర్థులను మట్టికరిపించాడు. అయితే టైసన్ వర్సెస్ పౌల్ మ్యాచ్‌లో.. మొత్తం 8 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ రెండు నిమిషాలు ఉంటుంది. సాధారణ 10 ఔన్సుల గ్లోవ్స్ కన్నా.. ఫైటర్లు 14 ఔన్సుల గ్లోవ్స్‌లో తొడగనున్నారు. గాయాలను తగ్గించేందుకు ఎక్స్ట్రా ప్యాడింగ్ తో బాక్సర్లు బరిలోకి దిగనున్నారు.