లండన్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఐసీసీ ఈవెంట్లలో జరిగే మ్యాచ్‌లను ఇకనైనా రద్దుచేయాలని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ అథర్టన్ డిమాండ్ చేశాడు. ఐసీసీ, బ్రాడ్కాస్టర్ల ఆర్థికావసరాల కోసమే దాయాదుల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారని ఆయన ‘ది టైమ్స్’కు రాసిన వ్యాసంలో మండిపడ్డాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో ఇరుజట్ల మధ్య ‘నో షేక్‌హ్యాండ్’, ఆటగాళ్ల విపరీత ప్రవర్తన, ట్రోఫీ వివాదం నేపథ్యంలో అథర్డన్ వ్యాసం చర్చనీయాంశమవుతున్నది. ‘2013 నుంచి భారత్, పాకిస్థాన్ ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతి ఈవెంట్లో గ్రూప్ దశలో తలపడుతున్నాయి. అంటే మూడు వన్డే ప్రపంచకప్‌లు, ఐదు టీ20, మూడు చాంపియన్స్ ట్రోఫీలలో ఈ జట్లు ఆడాయి. ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల కొరత ఉన్నప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు పదేపదే తలపడటం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆర్థికావసరాలే..
ప్రసారహక్కుల విలువ అధికంగా ఉండటమూ దీనికి ఒక కారణం. ఒకప్పుడు క్రికెట్ దౌత్యానికి వారధిగా ఉంటే ఇప్పుడు అది విస్తృత ఉద్రిక్తతలకు దారితీసే వనరుగా మారింది. గతంలో ఒకరి భూభాగంలో ఒకరు క్రికెట్ ఆడటం అనేది రెండు దేశాలు మాట్లాడుకునే మార్గం. కానీ ఇప్పుడు ఆ స్థానంలో నిశ్శబ్ధం అలుముకుంది. తదుపరి ప్రసారహక్కుల చక్రంలో అయినా ఐసీసీ ఈవెంట్లకు ముందు ఫిక్చర్ డ్రా పారదర్శకంగా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా ఏర్పాటుచేస్తున్న ఈ ఫిక్చర్లను నిలిపేయాలి’ అని రాసుకొచ్చాడు. రాజకీయ, సరిహద్దు ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని వ్యూయర్షిప్ పెంచుకునే ఈ సంస్కృతికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని అథర్డన్ డిమాండ్ చేశాడు.