Ajinkya Rahane | డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబయి ఇండియన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి.. ఐపీఎల్లో ఖాతా తెరిచింది. వరుస రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన ముంబయి.. ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబయితో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్‌లో ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌పై మండిపడ్డాడు. బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇది మంచి వికెట్ అని.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని.. మ్యాచ్‌లో 180-190 పరుగులు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. వికెట్‌పై బౌన్స్‌ని ఉపయోగించుకోవాలని.. బౌలర్లు చాలా ప్రయత్నించినా.. పరుగులు సాధించలేకపోయామని చెప్పాడు. వరుసగా వికెట్లు పడిపోతూ వచ్చాయని.. పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత తిరిగి కోలుకుకోవడం కష్టమని తెలిపాడు.
ముంబయి యువ బౌలర్ అశ్వినీ అద్భుతమైన బౌలింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ 116 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో ఇదే తొలి అత్యల్ప స్కోరు. ఐపీఎల్లో కేకేఆర్ 120 పరుగుల కంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడం ఇది 10వ సారి. కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్ ఏమాత్రం బ్యాట్స్‌తో ఆకట్టుకోలేకపోయారు. పవర్‌ప్లేలోనే జట్టు 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆంగ్క్రిష్ రఘువంశీ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 11, రింకు సింగ్ 17, మనీష్ పాండే 19, రమణ్‌దీప్ సింగ్ 22 పరుగులు చేశారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్‌ని కూడా చేరుకోలేకపోయారు. ముంబయి తరఫున దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేశ్ పుత్తూర్, మిచెల్ సాంట్నర్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్లో కేకేఆర్‌పై ముంబయికి ఇది 24వ విజయం. వాంఖడే స్టేడియంలో కోల్‌కతాను ముంబయి 10వ సారి ఓడించింది. 43 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం ద్వారా ముంబయి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. రెండు పాయింట్లు, 0.309 నెట్ రన్ రేట్‌తో ముంబయి ఆరో స్థానానికి చేరుకోగా.. కేకేఆర్ పదో స్థానానికి పడిపోయింది. కేకేఆర్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. కానీ, నెట్ రన్ రేట్ -1.428గా ఉన్నది. ఆర్సీబీ ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. రెండు మ్యాచుల్లో విజయాలతో నాలుగు పాయింట్లతో పాటు +2.266 రన్‌రేట్ ఉన్నది.