అట్లాంటా : ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కోనుంది. బుధవారం అర్ధ రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా..బలమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సాకర్ సామ్రాజ్యంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌లో 21 ఏండ్ల తర్వాత మళ్లీ ముఖాముఖి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టోర్నీలో ఇంగ్ల్లండ్ ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోంది. నాకౌట్ దశలో కాంగో, సహ ఆతిథ్య జట్టు మెక్సికో, నార్వేపై విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఆ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఆరు గోల్స్ సాధించగా, మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ కూడా ఆరు గోల్స్, ఒక అసిస్ట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు, డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా శ్రమించి సెమీస్‌కు వచ్చింది. గ్రూప్-జె లో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు.. నాకౌట్ రౌండ్లలో కాబో వెర్డ్డె, ఈజిప్ట్‌ను ఓడించేందుకు చెమటోడ్చింది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై ఎక్స్ట్రా టైమ్‌లో 3-1తో విజయం సాధించింది. అర్జెంటీనాను కెప్టెన్ లియోనల్ మెస్సీ ముందుండి నడిపిస్తున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ.. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్, రెండు అసిస్ట్‌లు సాధించాడు. ఇక, ముఖాముఖిలో అర్జెంటీనాపై ఇంగ్లండ్‌దే పైచేయి కావడం మెస్సీ అభిమానులను కాస్త ఆందోళనపరిచే విషయం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగ్గా.. ఇంగ్లండ్ ఆరుసార్లు నెగ్గితే.. అర్జెంటీనా 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.మరి, ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.