Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) ఢిల్లీలో తన మేనియా చూపిస్తున్నాడు. ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం.. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించాడు. తన బృందంతో కలిసి మైదానంలోకి వెళ్లిన మెస్సీ ఐసీసీ చీఫ్ జై షా (Jai Shah)తో కలిసి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) టికెట్ విడుదల చేశాడు. ఆ తర్వాత ‘మినెర్వా అకాడమీ’ (Minerva Academy)కి చెందిన యువకులతో ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు సాకర్ లెజెండ్.
భారత్‌లో అభిమానుల నీరాజనాలతో పులకించిపోతున్ను మెస్సీ బృందం సోమవారం ఢిల్లీ చేరుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సాకర్ స్టార్ అడుగుపెట్టగానే అభిమానులు మెస్సీ.. మెస్సీ నినాదాలతో హోరెత్తించారు. మైదానంలో సూరజ్, రొడ్రిగో డీపౌల్.. జై షాతో కలిసి భారత్, అమెరికా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ టికెట్‌తో ఫొటోలకు ఫొజిచ్చాడు. ఈ సందర్భంగా మెస్సీకి ప్రత్యేకమైన బ్యాట్‌ను బహూకరించాడు షా. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ పాల్గొన్నారు.
Argentina’s #LionelMessi at the Arun Jaitley Stadium, New Delhi, during his GOAT tour of India during the Meet and Greet session.
📸 @Sushil_Verma9 pic.twitter.com/5MzSlL2oR7
— The Hindu (@the_hindu) December 15, 2025
ఢిల్లీ పర్యటనలో అడిడాస్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొనున్న మెస్సీ టీమ్.. అనంతరం వాంతార (Vantara) వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్నించనున్నారు. అక్కడే ఈ ఫుట్‌బాల్ హీరోలకు భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వనున్నారని సమాచారం.
అర్జెంటీనా లెజెండ్ మెస్సీ రాకతో ఢిల్లీవాసులు ఓవైపు ఖుషీ అవుతూనే.. గాలి కాలుష్యంతో అతడి ఆరోగ్యం చెడుతుందని మరికొందరు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ ఢిల్లీకి వచ్చేశావు. మరి.. నీ ఊపిరితిత్తులకు బీమా ఉందా? అని సరదాగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఢిల్లీలోకి స్వాగతం మెస్సీ. నీ ఎడమ కాలికి 900 అమెరికా డాలర్లతో బీమా చేయించావని తెలిసింది. మరి.. నీ ఊపిరితిత్తులకు బీమా ఉందా? అని నెట్టింట వెలిసిన పోస్ట్ నవ్వు తెప్పిస్తోంది.