నిన్బో(చైనా): ప్రతిష్టాత్మక షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో యువ షూటర్ మేఘన సజ్జనార్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో మేఘన 230.0 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. గత ఎనిమిదేండ్లలో మేఘనకు ఇది తొలి ప్రపంచకప్ పతకం కావడం విశేషం.
ఇదే కేటగిరీలో జిన్లు పెంగ్(255.3, చైనా), డుస్టాట్ డెనెటె(252.6, నార్వే) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. తన దేశానికే చెందిన వాంగ్ జీఫి(254.8) స్కోరును అధిగమిస్తూ చైనా యువ సంచలనం పెంగ్ నయా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉంటే భారత్ ఓ స్వర్ణం, కాంస్యంతో ఐదో స్థానంలో కొనసాగుతుంటే.. చైనా (3 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యం) అగ్రస్థానంలో ఉంది.