Daniil Medvedev: యూఎస్ ఓపెన్(US Open 2023)లో మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev) అదరగొట్టాడు. వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు ఝలక్ ఇచ్చాడు. మూడోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మొత్తంగా మెద్వెదేవ్‌కు ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. దాంతో, అత్యధిక గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి రష్యా ఆటగాడిగా మెద్వెదేవ్ రికార్డు సృష్టించాడు. తమ దేశానికే చెందిన మరాత్ సఫిన్(Marat Safin)ను వెనక్కి నెట్టాడు. సఫిన్ గతంలో నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడాడు.
ఆర్దర్ ఆషే స్టేడియంలో మూడున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్ అల్కరాజ్కు షాకిచ్చాడు. టైటిల్ పోరులో నొవాక్ జకోవిచ్(Novak Djokovic)తో అతడు అమీతుమీ తేల్చుకోనున్నాడు. గతంలో రెండుసార్లు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన మెద్వెదేవ్ టైటిల్ అందుకోలేకపోయాడు.
డానిల్ మెద్వెదేవ్, మరాత్ సఫిన్
దాంతో, ఈసారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలనే కసితో ఉన్నాడు. 2017లో మెద్వెదేవ్ వింబుల్డన్(Wimbledon) చాంపియన్‌గా అవతరించాడు. ఆ తర్వాత పలుమార్లు టైటిల్‌కు చేరువగా వచ్చినా నిరాశే ఎదురైంది.
A 15th meeting awaits Sunday. pic.twitter.com/ZrUCzbwXDo
— US Open Tennis (@usopen) September 9, 2023
అయితే.. ఈ ఏడాది 23వ గ్రాండ్‌స్లామ్‌తో రికార్డు నెలకొల్పిన జకోవిచ్‌ను ఓడించడం అతడికి అంత ఈజీ కాదు. వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో కంగుతిన్నజకో సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ సాధించి ఫామ్ చాటుకున్నాడు. జకోవిచ్, మెద్వెదేవ్ ఇప్పటివరకూ 14 సార్లు తలపడ్డారు. అయితే.. జకో 9 విజయాలతో అతడి పైచేయి సాధించాడు. ఈసారి ఫలితం ఎలా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.