మెల్బోర్న్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మాథ్యూ హేడెన్ మెంటర్‌గా చేస్తున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. పాక్ ప్లేయర్లను ఉద్దేశిస్తూ మెంటర్ హేడెన్ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోను పాక్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్లో పోస్టు చేసింది. హేడెన్ తమ ప్లేయర్లకు ఇచ్చిన సందేశంలో ఇలా మాట్లాడారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో పాక్ ఆటగాళ్లు పోరాడిన తీరు గర్వంగా ఉందన్నారు.
వరల్డ్‌కప్‌లో పాక్ ప్రదర్శన ఇచ్చిన తీరు ఆసక్తికరంగా ఉందన్నారు. ఫైనల్లో ఓడిపోవడం బాధాకర విషయమే అయినా.. విజయానికి చాలా చేరువగా వచ్చామన్నారు. మీ పట్ల గర్వంగా ఉందని, మీరు అద్భుతమైన ఆట ఆడారని, మీ అభిప్రాయాలను నాతో పంచుకున్నందకు థ్యాంక్స్ అని హేడెన్ తెలిపారు.
ఇండియాలో జరిగే వరల్డ్‌కప్ వరకు పాక్ క్రికెటర్ల ప్రదర్శన మరింత రాటుదేలనున్నట్లు హేడెన్ వెల్లడించారు. నెల రోజుల క్రితం మీరంతా మా ఇంట్లో భోజనం చేశారని, ఆ సమయంలో మీరు వరల్డ్‌కప్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న యువకులు వరల్డ్‌కప్‌ను గెలిచే సత్తా ఉన్నావాళ్లే అని, ఈ టోర్నీ నుంచి మునుముందు కూడా రాణించాలని, ఇండియాలో జరగనున్న వరల్డ్‌కప్ లో విజయం సాధించి ఆ సంబరాలు చేసుకోవాలని హేడెన్ అన్నారు.