ఢాకా: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (397 బంతుల్లో 199; 19 ఫోర్లు, ఒక సిక్సర్) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మాథ్యూస్ పరుగు తేడాతో ద్విశతకానికి దూరమయ్యాడు. మాథ్యూస్ రాణించడంతో లంక తొలి ఇన్నింగ్స్లో 397 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (66), కుషాల్ మెండిస్ (54) అర్ధ శతకాలు నమోదు చేసుకున్నారు.
బంగ్లా బౌలర్లలో నయీమ్ హసన్ 6, షకీబ్ అల్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా.. సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న బంగ్లా.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. మహ్ముదుల్ హసన్ (31), తమీమ్ ఇక్బాల్ (35) క్రీజులో ఉన్నారు.