కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ ఆరో తేదీన ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్(IPL 2025)ను రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మ్యాచ్ నిర్వహణకు సిటీ పోలీసు నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు. ఆ రోజు శ్రీరామ నవమి సెలబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ నిర్వహణకు అనుమతి దక్కేది అనుమానంగా ఉన్నది. రామనవమి సందర్భంగా బెంగాల్లో సుమారు 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు తీసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేశారు. దీంతో సెక్యూర్టీ సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో మ్యాచ్ నిర్వహణ కోసం సెక్యూర్టీని మోహరించడం కష్టంగా మారుతుంది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ స్నేహశిశ్ గంగూలీ ఇప్పటికే సిటీ పోలీసులతో రెండు సార్లు చర్చలు జరిపారు. అధికారులు మ్యాచ్ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. భద్రతను కల్పించలేమని పోలీసులు చెబుతున్నారన్నారు. పోలీసు ప్రొటక్షన్ లేకుండా 65వేల మంది ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ గంగూలీ తెలిపారు. అయితే మ్యాచ్ తేదీపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని, అందుకే ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది కూడా రామనవమి రోజున షెడ్యూల్ అయిన మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ను గత ఏడాది నవమి సందర్భంగా రీషెడ్యూల్ చేశారు.
2025 ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెర్మనీని మార్చి 22వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. 35 నిమిషాల పాటు ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. గాయని శ్రేయా ఘోషల్, దిషా పఠానీ .. ప్రత్యేకంగా పర్ఫార్మ్ చేయనున్నారు. ఐసీసీ చైర్మెన్ జే షాతో పాటు ఇతర పెద్దలు ఓపెనింగ్ సెర్మనీకి హాజరుకానున్నారు.