T20 World Cup | ఫ్లోరిడా: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూసినా రోహిత్ సేనకు నిరాశే ఎదురైంది. టీమ్ఇండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. శనివారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ వేదికగా కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రైద్దెంది. గత వారం రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షంతో శ్రీలంక-నేపాల్, అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ లూ టాస్ పడకుండానే రద్దు కాగా శనివారమూ అదే సీన్ పునరావృతమైంది. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ దక్కింది. దీంతో మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్-ఏ నుంచి అగ్రస్థానం దక్కించుకుని సూపర్-8 పోరుకు సిద్ధమైంది. ఇదే గ్రూపు నుంచి అమెరికా 5 పాయింట్లతో రెండో జట్టుగా తదుపరి దశకు ముందంజ వేసింది.
గ్రూప్ దశ పోటీలు ముగింపు దశకు చేరడంతో ఈనెల 20 నుంచి సూపర్ -8 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈ దశలో 8 జట్లూ రెండు గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూపులో ఉన్న మిగిలిన మూడు జట్లతో తలపడతాయి. ఈ క్రమంలో సూపర్ -8లో రోహిత్ సేన.. జూన్ 20న అఫ్గానిస్థాన్ (అంటిగ్వా)తో మొదటి మ్యాచ్ ఆడనుంది. 22న గ్రూప్ డీ లో రెండో స్థానంలో నిలిచే జట్టు (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్)తో తలపడాల్సి ఉం టుంది. 24న ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది.
ఫ్లోరిడాలో వరుసగా మూడో మ్యాచ్ టాస్ పడకుండానే రద్దవడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై క్రీడా విశ్లేషకులతో పాటు అభిమానులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-కెనడా మ్యాచ్ రద్దయ్యాక మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ వర్షాలు వచ్చే సూచన ఉంటే స్టేడియాలు పూర్తిగా కప్పిఉంచేలా ఏర్పాట్లు చేయాలని వాళ్లు అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ టోర్నీకి ఆతిథ్యదేశంగా ఉన్న వెస్టిండీస్‌లోనూ వర్షాల కారణంగా పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. శనివారం నమీబియా-ఇంగ్లండ్ మధ్య అంటి గ్వా వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లోనూ వరుణుడు అడ్డుకోవడంతో డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది.