Multan Test | ముల్తాన్ : స్వదేశంలో ఇంగ్లండ్తో ముల్తాన్ వేదికగా సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ దంచికొట్టింది. కెప్టెన్ షాన్ మసూద్ (151), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (105) శతకాల మోత మోగించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. కొద్దిరోజుల క్రితమే బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న పాక్.. ఇంగ్లండ్తో తొలి రోజు సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ సమీ అయూబ్ (4) వికెట్ను 4వ ఓవర్లోనే కోల్పోయినా అబ్దుల్లా, మసూద్ కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడారు. బ్యాటింగ్కు స్వర్గధామమైన ముల్తాన్లో రెండో వికెట్కు ఈ ఇద్దరూ 253 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా మసూద్.. వన్డే తరహా ఆట ఆడటంతో పాక్ భారీ స్కోరు సాధించింది.