WFI : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్‌లను లెజెండరీ అథ్లెట్, బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలోని కమిటీ విచారించనుంది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. రెజ్లర్ల ఆందోళనను తీవ్రంగా పరిగణించిన భారత ఒలింపిక్ సంఘం శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. ఏడుగురు సభ్యుల బృందంలో మేరీకోమ్, డోలా బెనర్జీ, అలక్‌నంద అశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్ ఉన్నారు. అయితే.. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రెజ్లర్లు తేల్చి చెప్పారు.
మహిళా రెజ్లర్లను వేధింపులకు గురి చేస్తున్న బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని రెజ్లర్లు మూడు రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో గురువారం రాత్రి జరిపిన తొలి విడత చర్చలు విఫలం అయ్యాయి. దాంతో బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు లెటర్ రాశారు. అందులో.. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోవడంతో వినేష్ ఫోగట్‌ను బ్రిజ్ భూషణ్ మానసికంగా వేధించారు. దాంతో, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అంతేకాదు బ్రిజ్ భూషణ్ నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉంది అని అందులో వివరించారు. వీళ్లకు భజ్రంగ్ పూనియా, రాహుల్, దీపక్ పూనియా వంటి స్టార్ రెజ్లర్లు కూడా మద్దతు తెలిపారు.