ముంబై: రెండేండ్ల అనంతరం స్వదేశం వేదికగా బయోబబుల్ నీడలో సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే జట్టు ఫిజియో ఫ్యాట్రిక్ ఫర్హాత్‌కు కొవిడ్-19 సోకగా తాజాగా సోమవారం మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌తో పాటు జట్టు డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజర్‌కు వైరస్ సోకింది. తొలుత మార్ష్‌కు నెగిటివ్ రాగా తర్వాత జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా దవాఖానలో మార్ష్‌కు చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌పై అస్పష్టత నెలకొంది. ప్రస్తుతం ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బందిని హోటల్ రూమ్‌ల్లో ఉంచామని, కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలిన తర్వాతే బుధవారం ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతేడాది పటిష్ఠమైన బయోబబుల్ మధ్య లీగ్‌ను నిర్వహించినా..కేసులు వెలుగుచూడటంతో అర్ధాంతరంగా యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా ఈసారి కేసులు తగ్గుముఖం పట్టడంతో స్వదేశంలో నిర్వహిస్తున్నారు.