ఝజ్జర్ (హర్యానా): డబుల్ ఒలింపిక్ మెడలిస్టులు నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఇటీవల ఈ ఇద్దరూ పారిస్‌లో నీతా అంబానీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఇండియా హౌస్’లో సత్కార కార్యక్రమం సందర్భంగా కలిసి ముసి ముసి నవ్వులు చిందించుకుంటూ ముచ్చటించుకోవడం, అదే వేడుకలో మను తల్లి నీరజ్‌తో ఒట్టు వేయించుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ ఒక్కటవబోతున్నారన్న చర్చ జోరందుకుంది. దీనిపై తాజాగా మను తండ్రి రామ్ కిషన్ మాట్లాడుతూ తమకు అలాంటి ఆలోచనే లేదని కొట్టిపారేశాడు. ‘మను చిన్నపిల్ల. తనకింకా పెళ్లీడు రాలేదు. మాకు ఇప్పట్లో ఆమె వివాహం గురించిన ఆలోచన లేదు’ అని అన్నాడు. మను తల్లి నీరజ్నూ కొడుకుగా భావిస్తుందని వీడియోలో ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను చూడొచ్చని తెలిపాడు. ఇదే విషయమై నీరజ్ సమీప బంధువు ఒకరు స్పందిస్తూ.. ‘దేశానికి నీరజ్ రెండో పతకం అందించాడు. ఆ విషయం దేశం మొత్తానికి తెలుసు. అలాగే అతడు పెండ్లి చేసుకునేటప్పుడూ అందరికీ తెలుస్తుంది’ అని చెప్పాడు.