ఢిల్లీ : త్వరలో రూర్కెలా వేదికగా మొదలుకానున్న ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్‌కు గాను ప్రకటించిన 33 మంది సభ్యుల భారత హాకీ జట్టులో స్టార్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మన్‌ప్రీత్‌తో పాటు ఫార్వర్డ్ దిల్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ కృష్ణన్ బహదూర్ పాఠక్ కూడా జట్టులో చోటు కోల్పోయారు. అయితే ఈ ముగ్గురిపై వేటు వేయడానికి కారణం క్రమశిక్షణా చర్యలే అని తెలుస్తున్నది.
రెండు నెలల క్రితం దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆ దేశం వెళ్లిన సందర్భంగా మన్‌ప్రీత్, దిల్‌ప్రీత్, బహదూర్ టీమ్ మీటింగ్‌కు హాజరుకాలేదు. అంతకంటే ముందురోజు రాత్రి ఈ ముగ్గురూ కారులో ఒక ఆటగాడికి నిషేధిత పదార్థాన్ని ఇచ్చి తినాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ త్రయం టీమ్ మేనేజ్మెంట్కు క్షమాపణలు చెప్పినా హాకీ ఇండియా మాత్రం దీనిని సీరియస్‌గా పరిగణించి వారిపై వేటు వేసినట్టు సమాచారం.