ఢిల్లీ: ఇటీవలే ముగిసిన సౌదీ స్మాష్ టోర్నమెంట్లో సంచలన ప్రదర్శనలతో మెరిసిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్ర మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆమె 24వ ర్యాంకుకు దూసుకెళ్లింది. భారత్ తరఫున సింగిల్స్ కేటగిరీలో ఒక ప్యాడ్లర్ టాప్-25లో చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2022లో మనికా.. మహిళల డబుల్స్‌లో అర్చనా కామత్‌తో కలిసి 4వ ర్యాంకుకు చేరుకోగా తాజాగా సింగిల్స్‌లో ఆమె అత్యుత్తమ ర్యాంకు పొందడం విశేషం. సౌదీ స్మాష్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మన్యు (చైనా), 14వ ర్యాంకర్ నినా మిత్తెల్హమ్ (జర్మనీ)ని ఓడించి క్వార్టర్స్ చేరడం ఆమెకు కలిసొచ్చింది. దీంతో మనికా ఏకంగా 15 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకు సాధించింది. తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల మూడు ర్యాంక్‌లు కోల్పోయి 41వ ర్యాంకులో నిలిచింది.