IND vs SRI : కొలంబో (Colombo) లో శ్రీలంక (Srilanka) తో జరుగుతున్న మహిళల ముక్కోణపు సిరీస్ (Tri series) ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన (Smriti Mandhana) సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు రాబట్టింది. శ్రీలంక ముందు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతికా రావల్ జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ప్రతికా రావల్ (49 బంతుల్లో 30 పరుగులు) ఔట్ అయ్యింది. భారత్ 14.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఆ తర్వాత మందానకు వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ జతచేరింది.
తర్వాత మందాన ధాటిగా ఆడింది. కేవలం 92 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ చేసింది. హర్లీన్తో కలిసి 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరికి 33వ ఓవర్లలో 116 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యింది. 101 బంతుల్లో రెండు సిక్సులు, 15 ఫోర్లతో 116 పరుగులు చేసింది. మందాన ఔటయ్యేటప్పటికి భారత్ 32.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 190 పరుగులతో ఉంది.
హర్లీన్ డియోల్ 56 బంతుల్లో నాలుగు బౌండరీలతో 47 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. ఆఖరులో సుగంధిక కుమారి 30 బంతుల్లో 41 పరుగులు రాబట్టింది. ఆఖరికి నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగులు చేసి శ్రీలంక ముందు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.