న్యూఢిల్లీ: దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పారదర్శకత, అవినీతి రహిత క్రీడా సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్'(ఎన్ఎస్జీ) బిల్‌ను తీసుకొచ్చింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా ఎన్ఎస్జీ ప్రతులను ప్రవేశపెట్టారు. దీని కింద దేశంలోని అన్నీ జాతీయ క్రీడా సమాఖ్య(ఎన్ఎస్ఎఫ్)లు నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్(ఎన్ఎస్బీ) కిందకు రానున్నాయి. దీనిద్వారా ఏండ్లుగా కోర్టుల్లో నలుగుతున్న వివాదాలకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా ఆయా ఎన్‌ఎస్‌ఎఫ్‌లో పేరుకు పోయిన ఎన్నికల అవకతవకలు, అవినీతి సంబంధిత వ్యవహారాలపై ఈ బిల్లులో ప్రముఖంగా ప్రస్తావించారు.
జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎన్నికల నుంచి ఎంపిక ప్రక్రియ వరకు ఏదైనా అవినీతి ఉంటే వాటిని నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించనున్నారు. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలను ఈ ట్రిబ్యునల్‌కు కల్పిస్తూ బిల్లును రూపొందించారు. ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఇందులో కల్పించారు. ఇదిలా ఉంటే తాజా బిల్లుతో బీసీసీఐ..ఎన్ఎస్ఎఫ్ల పరిధిలోకి రానుంది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక మద్దతు లేకుండా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించిన బీసీసీఐ..నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు కిందకు రానుంది.
తద్వారా మిగతా ఎన్ఎస్ఎఫ్ల తరహాలో బోర్డు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర ఎన్ఎస్ఎఫ్ల మాదిరిగా స్వయం ప్రతిపత్తి ఉన్నా..వివాదాలు ఉంటే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఎన్నికల నుంచి ఎంపిక ప్రకియ వరకు అన్నీ ఈ బిల్ ప్రకారమే జరుగుతాయి. లాస్ఎంజిల్స్(2028) ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరికతో ఈ బిల్లు పరిధిలోకి బీసీసీఐ రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తోడు 2036 విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారత్ అందుకు తగ్గట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐవోసీ)నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నది.
ఆయా ఇంటర్నేషనల్ క్రీడా సంఘాలు అభ్యంతరం చెప్పకపోతే 70 నుంచి 75 ఏండ్లు ఉన్న వారు కూడా ఎన్నికల్లో పోటీపడవచ్చు. ప్రతిపాదిత ఎన్‌ఎస్‌బీకి చైర్ పర్సన్, ఇతర సభ్యుల నియామకాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఎంపిక జరుగుతుంది. ఇందుకోసం ముందుగా సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉంటే డోపింగ్‌లో మరింత పారదర్శకత కోసం వాడా నిబంధనలకు అనుగుణంగా డోపింగ్ బిల్లును ప్రవేశపెట్టారు.