మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో నాలుగో టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదటి రోజే నిలకడగా ఆడింది. ఓల్డ్ ట్రాఫొర్డ్ (మాంచెస్టర్) వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (151 బంతుల్లో 61, 7 ఫోర్లు), యశస్వీ జైస్వాల్ (107 బంతుల్లో 58, 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించగా కేఎల్ రాహుల్ (46) మరో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ (37 రిటైర్డ్ హర్ట్) కాలి గాయంతో మైదానాన్ని వీడాడు. ఇంగ్లిష్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ (2/47) రెండు వికెట్లు తీయగా వోక్స్, డాసన్‌కు తలా ఒక వికెట్ దక్కింది.
తొలి సెషన్లో భారత్ ఆచితూచి ఆడింది. ఓపెనర్లు రాహుల్, జైస్వాల్.. షాట్ల జోలికి పోకుండా నిదానంగా ఆడారు. బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఈ ద్వయం.. డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చింది. లార్డ్స్ టెస్టులో జైస్వాల్‌ను రెండుసార్లు ఔట్ చేసిన ఆర్చర్‌కు ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా భారత ఓపెనర్ జాగ్రత్తగా ఆడాడు. 16 ఓవర్ల తర్వాత స్వయంగా స్టోక్స్ బంతినందుకున్నా ఈ జోడీ నిలకడగానే ఆడింది. కానీ లంచ్‌కు ముందు ఆర్చర్ వేసిన బౌన్సర్‌ను వెనక్కి వంగుతూ స్లిప్స్ మీదుగా బౌండరీకి తరలించిన జైస్వాల్.. స్టోక్స్ ఓవర్లో అప్పర్ కట్ సిక్స్‌తో అలరించాడు. తొలి సెషన్లో ఈ జోడీ.. 26 ఓవర్లు బ్యాటింగ్ చేసి 3 రన్‌రేట్‌తో 78 పరుగులు చేసింది.
భోజన విరామం తర్వాత భారత్ తడబడింది. 40 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ అనంతరం వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్లో చివరి బంతిని డిఫెన్స్ చేయబోయిన రాహుల్.. స్లిప్స్‌లో క్రాలీ చేతికి చిక్కడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే జైస్వాల్.. కార్స్ ఓవర్లో సింగిల్ తీసి తన కెరీర్లో 12వ, ఇంగ్లండ్‌పై 8వ (ఈ సిరీస్‌లో మూడో 50+ స్కోరు) అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. కానీ అతడు.. డాసన్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చాడు. 8 ఏండ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన డాసన్.. పునరాగమనంలో తన ఏడోబంతికే వికెట్ పడగొట్టడం విశేషం. జైస్వాల్ స్థానంలో వచ్చిన కెప్టెన్ గిల్ (12)ను ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. వికెట్ల ముందు బలిగొనడంతో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది.
రాహుల్ నిష్క్రమణ అనంతరం మూడో స్థానంలో వచ్చిన సాయి.. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే మొదలెట్టాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ స్మిత్ క్యాచ్ నేలపాలుచేయడంతో బతికిపోయిన అతడు.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక అతడు.. పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను పునర్నించాడు. టీ విరామం తర్వాత సాయి, పంత్ వేగం పెంచారు.
కార్స్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా పంత్ సిక్సర్ బాదాడు. కానీ వోక్స్ బౌలింగ్‌లో కాలికి దెబ్బతాకడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే సాయి.. బౌండరీతో తన కెరీర్లో తొలి అర్ధ శతకాన్ని నమోదుచేసుకున్నాడు. కానీ స్టోక్స్ అతడిని ఔట్ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (19*), శార్దూల్ ఠాకూర్ (19*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
లార్డ్స్ టెస్టులో చేతి వేలి గాయంతో కేవలం బ్యాటింగ్‌కే పరిమితమై ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకున్న పంత్.. మళ్లీ గాయం బారిన పడ్డాడు. మూడో సెషన్లో వోక్స్ వేసిన 68వ ఓవర్లో నాలుగో బంతిని పంత్ రివర్స్ స్వీప్ చేయబోయినా అది కాస్తా మిస్ అయి నేరుగా అతడి కుడి కాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. షూ విప్పి చూడగా చిటికెన వేలి పక్కన రక్తస్రావం అయింది. కనీసం నిలబడటానికీ ఇబ్బందిపడ్డ పంత్‌ను ప్రత్యేక వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించారు. వెళ్తున్నప్పుడు పంత్ నొప్పితో బాగా ఇబ్బందిపడ్డ దృశ్యాలు కనిపించాయి. మరి అతడి పరిస్థితేంటన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.