Marufa Akter : దిగ్గజ క్రికెటర్ల నుంచి అభినందనలు, ప్రశంసలు ఊరికే రావు. అందుకు జట్టును గెలిపించే ప్రదర్శన ఒక్కటే చాలదు. అసాధ్యమనిపించేలా.. అందరూ అవాక్కయ్యేలా బౌలింగ్ నైపుణ్యం ఉండాలి. బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అక్తర్ (Marufa Akter) ఇప్పుడు క్రికెట్ లెజెండ్స్ చేత ‘శభాష్’ అనిపించుకుంటోంది. మహిళల వన్డే ప్రపంచ కప్లోగురువారం పాకిస్థాన్‌పై ఆమె సంచలన బౌలింగే అందుకు కారణం. ఆరంభంలోనే పాక్‌ను దెబ్బకొట్టిన అక్తర్.. మహిళల వరల్డ్ కప్‌లోనే ది బెస్ట్ బాల్ వేసిందని మెచ్చుకున్నాడు శ్రీలంక వెటరన్ లసిత్ మలింగ(Lasith Malinga).
ప్రపంచకప్ లీగ్ దశలో గురువారం శ్రీలంకలోని ప్రేమదాస మైదానంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు మరుఫా అక్తర్ ఆదిలోనే షాకిచ్చింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఇమైమా సొహైల్, సిద్రా అమిన్లను బౌల్డ్ చేసింది. సొహైల్ వికెట్ అయితే మ్యాచ్‌కే హైలైట్. పాక్ ఓపెనర్ ముందొకొచ్చి డిఫెన్స్ ఆడాలనుకుంది. కానీ, మరుఫా సంధించిన ఇన్‌స్వింగర్ రెప్పపాటులోనే లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. బంగ్లా పేసర్‌కు ఫిదా అయిన మలింగ ఆమె సొహైల్‌ను బౌల్డ్ చేసిన బంతిని మహిళల వరల్డ్ కప్‌లోనే ది బెస్ట్ బాల్ అని కితాబిచ్చాడు.
‘ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో మరుఫ్ వేసిన బంతి ది బెస్ట్. అలాంటి ఇన్‌స్వింగర్ వేసేందుకు చాలా నైపుణ్యం, నియంత్రణ కావాలి’ అని తన ఫేస్బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చాడీ యార్కర్ కింగ్. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj) సైతం మరుఫాను అభినందించింది. ‘మరుఫా చలా స్వింగ్ రాబట్టింది. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసింది. ఆమెకు ఇది మొదటి వన్డే ప్రపంచకప్. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో మరుఫా బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాను’ అని కామెంటేటేర్ మిథాలీ అంది.
ఒకేఓవర్లో సూపర్ డెలివరీతో రెండు వికెట్లు తీసిన మరుఫా బౌలింగ్ వీడియో మీరూ చూసేయండి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను129కే కట్టడి చేసిన బంగ్లా.. అనంతరం 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు కీలక వికెట్లు తీసి బంగ్లాను పోటీలోకి తెచ్చిన మరుఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్ 7న ఇంగ్లండ్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.