ఢిల్లీ: విశ్వక్రీడల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ నిరాశజనక ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేంద్ర క్రీడా శాఖ, బాయ్ నుంచి నిధులు పొందుతున్న అథ్లెట్లు పారదర్శకంగా ఉండాలని, పతకాలు తీసుకురావడంలో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపాడు. ‘సెమీస్ మ్యాచ్‌లో లక్ష్య తొలి గేమ్‌ను 20-17తో ఆధిక్యంలో ఉన్నా ఆ తర్వాత చేతులెత్తేశాడు. కాంస్య పోరులోనూ అదే తంతు. క్రీడామంత్రిత్వ శాఖ, బాయ్ మీకు అన్ని వసతులు సమకూరుస్తోంది. మిమ్మల్ని అక్కడికి (ఒలింపిక్స్)కు ఎందుకు పంపిందనే విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా వ్యవహరించాలి. పతకాలు తీసుకురావడానికే కదా విదేశాలకు వెళ్లింది. కోర్టులో చక్కర్లు కొట్టడానికి కాదు కదా’ అంటూ ఓ కాలమ్‌లో రాసుకొచ్చాడు. అథ్లెట్లపై ప్రకాశ్ పదుకునే చేసిన వ్యాఖ్యలను గవాస్కర్ సమర్థించాడు.