SL vs ZIM : జింబాబ్వే పర్యటనలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. పేసర్ దిల్షాన్ మధుషనక (4-62) ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ తీయడంతో ఆతిథ్య జింబాబ్వేపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. సికిందర్ రజా (92), బెన్ కర్రాన్(70)లు అర్ధ శతకంతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ విక్టరీతో లంక సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక జయభేరి మోగించింది. మొదట ఓపెనర్ పథుమ్ నిశాంక(76), లియాంగే(70 నాటౌట్), కమిందు మెండిస్ (57)లు రాణించి భారీ స్కోర్ అందించారు. 299 పరుగుల ఛేదనలో జింబాబ్వే దూకుడుగా ఆడింది. బెన్ కర్రాన్ (70), సికిందర్ రజా(92)లు లంక బౌలర్లను ఉతికేస్తూ అర్ద శతకాలు బాదారు. దాంతో, లంక ఓటమి అంచున నిలిచింది. అయితే.. పేసర్ దిల్షాన్ మధుషనక (4-62) సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
10 needed off the final over, and Dilshan Madushanka did THIS 🤯 pic.twitter.com/kdkMLVIHxi
— ESPNcricinfo (@ESPNcricinfo) August 29, 2025
ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ తీసి జింబాబ్వేకు ఓటమి ఖాయం చేశాడు. ఆతిథ్య జట్టు విజయానికి చివరి ఓవర్లో పది పరుగులు అవసరం కాగా.. సికిందర్ రజాను బౌల్డ్ చేసి జింబాబ్వేకు షాకిచ్చాడు. రెండో బంతికి బ్రాడ్ ఎవాన్స్ ఫైన్ లెగ్‌లో దొరికిపోయాడు. మూడో బంతికి రిచర్డ్ నగవర మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టిన మధుషనక హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో హ్యాట్రిక్ తీసిన ఎనిమిదో లంక బౌలర్‌గా చరిత్రకెక్కాడీ పేస్ గన్. చివరి మూడు బంతుల్లో రెండు రన్స్ మాత్రమే రావడంతో లంక ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.