లండన్: మనుషులు ఈ మధ్య కాలంలో హఠాత్తుగా కుప్పకూలిపోవడం సాధారణమైంది. ఏదో మాయ చేసినట్లు ఉన్న మనిషి ఉన్నట్లే శ్వాస విడుస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో ప్రీమియర్ లీగ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. లుటన్ టౌన్, బౌర్న్మౌత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లుటన్ కెప్టెన్ టామ్ లాకిర్ ఆడుతుండగానే ఉన్నట్లు ఉండి కూలపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహచరులు, వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందజేశారు. హుటాహుటిని స్ట్రైచర్‌పై లాకిర్ను దగ్గరలోని దవాఖాను తరలించారు. తొలుత కార్డియాక్ అరెస్ట్ భావించినా కీలక సమయంలో చికిత్స అందించడంలో లాకిర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అప్పటి వరకు తమ అభిమాన ప్లేయర్‌కు ఏం జరుగుతుందో అనుకున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ‘మ్యాచ్ సాగుతున్న సమయంలో టామ్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. జట్టు సిబ్బంది చికిత్స అందించి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం లాకిర్ కుటుంబసభ్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడు’ అని లుటన్ టౌన్ ట్వీట్ చేసింది. గతేడాది జూన్‌లో లాకిర్ గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు.