లీగ్‌లో కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ దుమ్మురేపింది. ఆడిన పదకొండు మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటు అనధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. డికాక్ నిలకడకు దీపక్, స్టొయినిస్ మెరుపులు తోడవడంతో లక్నో మంచి స్కోరు చేస్తే.. అవేశ్, హోల్డర్ ధాటికి కోల్‌కతా నూటొక్క పరుగులకే ఆలౌటైంది. డేంజర్ మ్యాన్ రస్సెల్ పిడుగుల్లాంటి షాట్లు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి!
పుణె: బ్యాటర్ల బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు బౌలర్ల మెరుపులు తోడవడంతో ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో ఎనిమిదో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన రెండో పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 75 పరుగుల తేడాతో (33 బంతులు మిగిలుండగానే) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిం ది. 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న లక్నో పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో అభిమానులను హోరెత్తించగా.. దీపక్ హుడా (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టొయినిస్ (14 బంతుల్లో 28; ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 101 పరుగులకు ఆలౌటైంది. డేంజర్ మ్యాన్ రస్సెల్ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), బాబా ఇంద్రజిత్ (0), నితీశ్ రాణా (2), రింకూ సింగ్ (6), అనుకూల్ రాయ్ (0), ఫించ్ (14) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కొత్త కుర్రాడు మొహసిన్ ఖాన్ మూడు ఓవర్లలో ఆరు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అవేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
లక్నో: 20 ఓవర్లలో 176/7 (డికాక్ 50, దీపక్ హుడా 41; రస్సెల్ 2/22), కోల్‌కతా: 14.3 ఓవర్లలో 101 ఆలౌట్ (రస్సెల్ 45; అవేశ్ 3/19, హోల్డర్ 3/31).