IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో హ్యాట్రిక్ విజయాలు కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)కు ఊహించని షాక్. ఆ జట్టు కొత్త తరుపుముక్క మయాంక్ యాదవ్ (Mayank Yadav) మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన మయాంక్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం లక్నో సీఈవో కల్నల్ వినోద్ బిష్త్ వెల్లడించాడు.
‘మయాంక్‌కు పొట్ట కింది భాగంలో నొప్పిగా ఉంది. దాంతో, అతడి ఆరోగ్యం మరింత పాడవ్వకుండా చూసుకుంటున్నాం. అంతేకాదు మరో వారం వరకు అతడిపై బౌలింగ్ భార ఎక్కువ పడకుండా జాగ్రత్త పడుతున్నాం. మయాంక్ త్వరలోనే మైదానంలో అడుగుపెడుతాడని ఆశిస్తున్నాం’ అని వినోద్ తెలిపాడు. పదిహేడో సీజన్లో ఫాస్టెస్ట్ డెలివరీతో సంచలనం సృష్టించిన మయాంక్.. పదునైన పేస్, వైవిధ్యమైన బౌలింగ్‌తో లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పాడు.
అరంగేట్రంలోనే ఈ రైట్ ఆర్మ్ పేసర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై సంచలన ప్రదర్శనతో చేశాడు. ఛేదనలో కీలకమైన శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ వికెట్లు తీసి పంజాబ్ జోరుకు పగ్గాలు వేశాడు. తన వేగం, కచ్చితత్వం ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదంటూ రెండో గేమ్‌లోనూ ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్’ తడాఖా చూపించాడు. అయితే.. గుజరాత్‌పై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ వస్తున్న లక్నో.. ఏప్రిల్ 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్ 14వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.