లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రీజులో నిలబడటానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన ఇషాన్ కిషన్ (8) పెవిలియన్ చేరాడు. రవి బిష్ణోయి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి అతను అవుట్ అయ్యాడు. బిష్ణోయి వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన కిషన్.. టైమింగ్ మిస్ అవడంతో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది.
అయితే కింద పడకుండా కీపర్ డీకాక్ షూపై పడి గాల్లోకి లేచింది. దాన్ని స్లిప్స్‌లో ఉన్న హోల్డర్ అందుకోవడంతో డీకాక్ అప్పీల్ చేశాడు. రీప్లేలో బంతి డీకాక్ కాలిపై పడే ఎగిరినట్లు స్పష్టం అవడంతో కిషన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 20 బంతులు ఆడిన కిషన్ ఒక్క బౌండరీ కూడా లేకుండా కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే డెవాల్డ్ బ్రెవిస్ (3) కూడా అవుటయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని అప్పర్ కట్ చేయడానికి బ్రెవిస్ ప్రయత్నించాడు. కానీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న చమీరకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో ముంబై జట్టు 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.