కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. పవర్‌ప్లేలో డీకాక్ (50), దీపక్ హుడా (41) రాణించడంతో 67 పరుగులు చేసిన లక్నో.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే డీకాక్ అవుటైన తర్వాత కేకేఆర్ బౌలర్లు పట్టు బిగించారు. బౌండరీలు బాదే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
మూడు ఓవర్లు వేసిన రస్సెల్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసుకున్నాడు. నరైన్ కేవలం ఒకే ఒక్క సిక్సర్ ఇచ్చి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కోల్‌కతా పట్టుబిగించింది. శివమ్ మావి వేసిన 19వ ఓవర్లో స్టొయినిస్ (28) మూడు సిక్సర్లతో చెలరేగి తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. మిగిలిన రెండు బంతులను హోల్డర్ (13) సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 30 పరుగులు వచ్చాయి.
చివరి ఓవర్లో సౌథీ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు తీయగా.. నరైన్, సౌథీ, శివమ్ మావి తలో వికెట్ తీసుకున్నారు.