WI vs BAN 1st Test : సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ (West Indies) జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఓపెనర్ మికిలే లూయిస్(97), అలిక్ అథనజె(90)ల అర్ధ శతకాలతో కోలుకుంది. బంగ్లా బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ సాధికారిక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. మూడో వికెట్‌కు 140 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును ఒడ్డున పడేశారు. ప్రస్తుతం జస్టిన్ గ్రేవ్స్(41 నాటౌట్), కీమర్ రోచ్(14)లు బంగ్లాదేశ్ బౌలర్లకు పరీక్ష పెడుతూ క్రీజులో పాతుకుపోయారు. విండీస్ స్కోర్.. 309-7.
అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆచితూచి ఆడుతున్న విండీస్ ఓపెనింగ్ జోడీని బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్(2/19) విడదీశాడు. తొలుత కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(4)ను ఎల్బీగా వెనక్కి పంపిన తస్కిన్ లంచ్‌కు ముందు మరోసారి విజృంభించాడు. క్రీజులో కుదురుకునే పనిలో ఉన్న కేసీ కార్టీ(0)ని డకౌట్ చేశాడు. అంతే కరీబియన్ జట్టు ఒత్తిడిలో పడింది. లంచ్ సమయానికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. అయితే.. మరో ఓపెనర్ మికిలే లూయిస్(97), కవెం హొడ్గే(25)లు జాగ్రత్తగా ఆడారు.
Stability and elegance!🏏
The man from Dominica brings up his 3rd Test half century and 1st at the Sir Vivian Richards stadium.👏🏽#WIvBAN #WIHomeforChristmas pic.twitter.com/aQdMV8QUZA
— Windies Cricket (@windiescricket) November 22, 2024
హోడ్గే వెనుదిరిగాక వచ్చిన అలిక్ అథనజె(90) అండగా లూయిస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లను విసిగిస్తూ ఈ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు. అయితే.. సెంచరీ దిశగా వెళ్తున్న లూయిస్‌ను మెహిదీ హసన్ మిరాజ్ ఔట్ చేశాడు. దాంతో, మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే తైజుల్ ఇస్లాం ఓవర్లో అథనెజె వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. అప్పటికీ స్కోర్ 261-7. మరో రెండు మూడు ఓవర్లలో విండీస్ ఆలౌట్ అవ్వడం ఖాయం అనిపించింది. కానీ, జస్టిన్ గ్రేవ్స్(41), కీమర్ రోచ్(14)లు ఓపికగా ఆడుతూ కరీబియన్ జట్టు స్కోర్ 300 దాటించారు.