న్యూఢిల్లీ : దేశ క్రీడా చరిత్రలో కొత్త శకానికి నాంది పడింది! క్రీడా సంఘాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా సంస్కరణలకు బీజం పడింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏండ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ క్రీడాబిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం లోక్‌సభలో క్రీడాబిల్లుకు ఆమోదం లభించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సభలో బిల్లును ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాల ఆందోళన, గైర్హాజరీ మధ్య మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. బీహార్ ఎన్నికల జాబితాలో అవకతవకలపై ప్రతిపక్ష పార్టీలు..ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా వెళ్లడంతో సభలో సరైన చర్చకు ఆస్కారం లభించలేదు. ఇదే అదనుగా నరేంద్రమోదీ ప్రభుత్వం హడావుడిగా క్రీడాబిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడేలా పావులు కదిపింది. ప్రతిపక్షాల ఆందోళనతో మధ్యహ్నం తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు కూడా సభలో పాస్ అయ్యింది.
ఈ సందర్భంగా మంత్రి మాండవీయ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడల్లో అత్యంత కీలకమైన సంస్కరణ చోటు చేసుకుంది. ఈ బిల్లు ద్వారా పారదర్శకత, సత్వర న్యాయం, క్రీడాసంఘాల్లో మెరుగైన పరిపాలన లభిస్తుంది. దేశ క్రీడా ఎకో సిస్టమ్‌లో గుణాత్మక మార్పునకు ఈ బిల్లు దోహదం చేసుకుంది. ఇంతటి కీలకమైన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రతిపక్ష పార్టీలు లేకపోవడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. అయితే బిల్లుపై చర్చలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు స్పీకర్ అవకాశం కల్పించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు పోటీపడుతున్న భారత్‌కు ఈ బిల్లు ద్వారా దేశ క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చర్చ సందర్భంగా మంత్రి మాండవీయ స్పష్టం చేశారు. ముఖ్యంగా అవినీతి రహితంగా, పారదర్శకత వ్యవస్థతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు నాంది పడుతుందని ఆయన అన్నారు. 1975, 85 నుంచి క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా..సభ ముందుకు బిల్లు రావడం ఇది తొలిసారని అన్నారు. 2011లో నేషనల్ స్పోర్ట్స్ కోడ్‌పై అప్పటి క్యాబినెట్లో చర్చ జరిగినా..పార్లమెంట్‌కు చేరుకోలేకపోయిందని వివరించారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇప్పటి వరకు భారత్‌కు చెప్పుకోదగ్గ పతకాలు లేవు, కానీ ఈ బిల్లు ద్వారా సమూల మార్పులు చోటు చేసుకుంటాయని మంత్రి తెలిపారు.