Lionel Messi : అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించిన లియోనల్ మెస్సీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడితో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు క్లబ్స్ పోటీ పడుతుంటాయి. అయితే.. మెస్సీ మాత్రం పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)ను అనుసరిస్తున్నాడు. అవును.. ఈ సీజన్లో అతను కొత్త క్లబ్‌కు ఆడనున్నాడని సమాచరం. సౌదీ అరేబియాకు చెందిన క్లబ్‌తో ఈ స్టార్ ఆటగాడు ఒప్పందం చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
సౌదీ ఫుట్‌బాల్ క్లబ్, మెస్సీ మధ్య కాంట్రాక్టు కుదిరిందని అతడి సన్నిహితులు ఏజెన్సే ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్పి) వార్తా సంస్థతో చెప్పారు. అదే నిజమైతే మెస్సీ ఏడాదికి రూ. 3,300 కోట్లు సంపాదించనున్నాడు. ప్రస్తుతం మెస్సీ జర్మనీకి చెందిన పీఎస్జీ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది జూన్ 30 అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. దాంతో, ఈసారి కొత్త క్లబ్‌కు ఆడాలని మెస్సీ అనుకుంటున్నాడట.
ఖతర్‌లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ
ఫిఫా వరల్డ్ కప్ తర్వాత సౌదీకి చెందిన అల్ నస్రీ క్లబ్‌తో రొనాల్డో భారీ అగ్రిమెంటు చేసుకున్నాడు. రెండున్నరేళ్ల పాటు అతను అల్ నస్రీకి ఆడనున్నాడు. దాంతో, ఏడాదికి అతడు రూ. 1,760 కోట్లు ఆర్జించనున్నాడు. ఖతర్ జరిగిన వరల్డ్ కప్‌లో మెస్సీ అద్భుతంగా రాణించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా టైటిల్ అందించాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై 4-2తో అర్జెంటీనా గెలిచింది. దాంతో, వరల్డ్ కప్ గెలవాలన్న తన కలను మెస్సీ నిజం చేసుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత మెస్సీ, రొనాల్డో, ఎంబాపే, నెయ్మర్ వంటి స్టార్లంతా సౌదీ అరేబియాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మెస్సీ, ఎంబాపే, నెయ్మర్ పీఎస్జీ తరఫున, రొనాల్డో అల్ నస్రీ క్లబ్ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.