మాడ్రిడ్(స్పెయిన్): బార్సిలోనాతో 17 ఏండ్ల ప్రయాణానికి ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ముగింపు పలికాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఆడిన ఫుట్‌బాల్ క్లబ్‌కు మెస్సీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బార్సిలోనా ఎఫ్‌సీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మెస్సీ కాంట్రాక్టుకు డబ్బు చెల్లించే పరిస్థితి ప్రస్తుతానికి బార్సిలోనాకు లేదని, అందుకే అతడిని వదులుకుంటున్నట్టు క్లబ్ ప్రెసిడెంట్ జొవాన్ లపోట్రా వెల్లడించాడు. గత నాలుగేండ్ల కాంట్రాక్టు ప్రకారం మెస్సీకి ఒక్కో సీజన్‌కు బార్సిలోనా 168.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,250 కోట్లు) చెల్లించింది. 2004 నుంచి క్లబ్ కెరీర్లో మొత్తం బార్సిలోనా తరఫునే ఆడిన మెస్సీ.. 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌తో అదరగొట్టాడు. బార్సిలోనాకు 35 టైటిళ్లు అందించాడు. ఆటగాడిగా, సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు కట్టబెట్టి.. ఆరుసార్లు బాలెన్ డీ ఓర్ అవార్డు అందుకున్నాడు. ఇక బార్సిలోనాతో మెస్సీ శకం ముగియడంతో అతడు తదుపరి ఏ క్లబ్‌కు వెళతాడన్నది ఆసక్తికరంగా మారింది.