లండన్ : ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్‌తో రసవత్తరంగా ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు జట్టులో స్వల్ప మార్పులు చేసింది. లార్డ్స్ టెస్టులో గాయపడ్డ స్పిన్నర్ షోయభ్ బషీర్ స్థానంలో ఆ జట్టు.. లియామ్ డాసన్‌కు చోటు కల్పించింది.
2017లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడిన డాసన్.. 8 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి రావడం గమనార్హం. జాతీయ జట్టులోకి వస్తూ పోతూ ఉన్నా గత కొన్నేళ్లుగా అతడు హాంప్‌షైర్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ జాక్ లీచ్ ఉన్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం లీచ్‌ను కాదని డాసన్‌ను ఎంపిక చేశారు. మరి డాసన్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.