US Open | న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ రేసులో ఉన్న దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరాడు. న్యూయార్క్‌లోని ఆర్ధర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జొకో 6-4, 6-2, 2-0తో సెర్బియాకే చెందిన లాస్లొ జెరెపై గెలిచాడు. ప్రత్యర్థి నుంచి ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే జొకో ముందంజ వేశాడు. మూడో సెట్లో జెరె గాయంతో ఇబ్బందిపడి కోర్టును వీడటంతో జొకో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.
అతడితో పాటు రెండో రౌండ్లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 7-6 (7/5), 6-1తో ముల్లర్ (ఫ్రాన్స్)ను ఓడించగా.. కాస్పర్ రూడ్ (నార్వే) 6-4, 6-2, 2-6, 7-6 (7/3) మొన్ఫిల్స్ (ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. ఆండ్రీ రుబ్లెవ్, ఫ్రాన్సెస్ టియాఫో (యూఎస్ఏ), టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్ఏ), బెన్ షెల్టన్ సైతం మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్లో ఈ అమెరికా అమ్మాయి 6-4, 6-0తో టట్జన మరియ(జర్మనీ)ని వరుస సెట్లలో చిత్తుచేసి అలవోక విజయం అందుకుంది. బెలారస్ భామ ఎరీనా సబలెంక 6-3, 6-1తో బ్రొన్జెట్టి (ఇటలీ)ని మట్టికరిపించింది. విక్టోరియా అజరెంకా (బెలారస్), జెంగ్ (చైనా) తదుపరి రౌండ్‌కు చేరగా 8వ సీడ్, మాజీ వింబుల్డన్ చాంపియన్ అయిన బార్బొర క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)కు 6-4, 7-5తో ఎలీనా గాబ్రియాలా రుస్ (రొమేనియా) షాకిచ్చింది.