పారిస్ ఒలింపిక్స్‌లో ఆరు రోజుల వ్యవధిలోనే మూడు పతకాలు సాధించిన భారత క్రీడాకారులు అడుగులు మళ్లీ ఆ దిశగా సాగడం లేదు. పదో రోజు ఆటల్లో భాగంగా దేశానికి రెండు పతకాలు అందినట్టే అంది త్రుటిలో చేజారాయి. బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్ గెలిచి ‘ఇక పతకం ఖాయమే’ అనుకుంటున్న తరుణంలో గాడి తప్పితే.. స్కీట్ షూటింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఒకే ఒక్క పాయింట్ తేడాతో పతకం కోల్పోయింది. సోమవారం నుంచి మొదలైన రెజ్లింగ్ పోటీలను తొలి రోజే భారత్ ఓటమితో ఆరంభించింది. టేబుల్ టెన్నిస్ టీమ్‌ఈవెంట్‌లో మన ప్యాడ్లర్లు క్వార్టర్స్ చేరారు.
Paris Olympics | పారిస్: విశ్వక్రీడల పదో రోజు పోటీల్లో భారత్‌కు మరో రెండు పతకాలు అందినట్టే అంది త్రుటిలో చేజారాయి. పురుషుల బ్యాడ్మింటన్‌లో కాంస్య పోరుకు అర్హత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కిన యువ షట్లర్ లక్ష్యసేన్ పతకం గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. కాంస్య పతక పోరులో సేన్ 21-13, 16-21, 11-21తో లీ జి జియా (మలేషియా) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌ను అలవోకగా గెలుచుకున్న సేన్ రెండోగేమ్ ఆరంభంలోనూ అదరగొట్టాడు. అతడు 7 పాయింట్ల వద్ద ఉండగా ప్రత్యర్థి 2 పాయింట్లతో వెనుకబడి సేన్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డట్టే కనిపించాడు. కానీ ఆ తర్వాత లీ క్రమంగా పుంజుకుని భారత షట్లర్‌కు షాకిచ్చాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ జియా అదే దూకుడును కొనసాగిస్తూ గేమ్‌తో పాటు కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఆట మధ్యలో కుడిచేయి మోచేతి వద్ద గాయం లక్ష్యసేన్‌ను పదే పదే వేధించడమూ అతడి ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇక బ్యాడ్మింటన్ పురుషుల ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ విక్టర్ అక్సెల్సెన్ 21-11, 21-11తో కున్లావత్ విదిత్‌సర్న్ (థాయ్‌లాండ్)ను ఓడించి వరుసగా ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించాడు. కున్లావత్కు రజతం దక్కింది.
టేబుల్ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు..
వ్యక్తిగత పోటీలలో క్వార్టర్స్ వరకూ వెళ్లి అక్కడ భంగపడ్డ భారత ప్యాడ్లర్లు టీమ్ ఈవెంట్లో రాణించి మరోసారి పతకం దిశగా సాగుతున్నారు. మనికా బాత్ర, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌తో కూడిన భారత బృందం.. 3-2తో రొమేనియాను చిత్తు చేసింది. మొదట శ్రీజ-అర్చన డబుల్స్ మ్యాచ్‌లో 3-0తో గెలుపొందగా ఆ తర్వాత మనిక సైతం సింగిల్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని భారత్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపింది. కానీ శ్రీజ, కామత్ సింగిల్స్ రౌండ్లలో ఓడటంతో స్కోరు 2-2తో సమమైంది. చివరి సింగిల్స్‌లో మనిక గెలుపుతో భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
వెంట్రుకవాసిలో తప్పిన గురి..
షూటింగ్లో ఇది వరకే మూడు పతకాలు తెచ్చిన షూటర్లు మరో పతకం సాధించే అవకాశాన్ని వెంట్రుకవాసిలో కోల్పోయారు. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్‌సింగ్ నరుకాతో కూడిన భారత్ 43 పాయింట్లు స్కోరు చేయగా యిటింగ్ జియాంగ్, జియాన్లిన్ లియు ప్రాతినిథ్యం వహిస్తున్న చైనా 44 పాయింట్లు సాధించి పతకాన్ని ఎగురేసుకుపోయింది. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో భారత ద్వయం 146 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించింది. కానీ కీలక దశలో ఒక్క పాయింట్ తేడాతో పతకాన్ని
చేజార్చుకుంది.
ఓటమితో ఆరంభం..
సోమవారం నుంచి మొదలైన రెజ్లింగ్ పోటీలను భారత్ ఓటమితో ఆరంభించింది. మహిళల 68 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో పోటీపడ్డ యువ రెజ్లర్ నిషా దహియా క్వార్టర్స్‌లో 8-10తో పక్ సొల్ గమ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓడింది. మూడో బౌట్ మరో 90 సెకన్లలో ముగుస్తుందనగా నిషా కుడిచేతి వేలికి గాయమవడంతో ఆమె ‘పట్టు’ కోల్పోయింది. మెడికల్ బ్రేక్ తర్వాత మళ్లీ బరిలోకి దిగినా నిషాకు ఓటమి తప్పలేదు. కాగా క్వార్టర్స్‌లో ఓడినా నిషాకు మరో అవకాశం ఉంది. సొల్ గమ్ ఫైనల్ చేరితే ‘రెపిచేజ్’ రౌండ్‌తో నిషా మరోసారి బరిలోకి దిగొచ్చు. అంతకుముందు తొలి బౌట్లో నిషా 6-4తో టెటియానా సొవ (ఉక్రెయిన్)ను ఓడించింది.
పతకానికి ముందు ప్రశాంతత
ఉక్రెయిన్ హైజంపర్ యరొస్లవ మహుచిఖ్ తన ఫైనల్ పోటీలకు ముందు ప్రశాంతంగా నిద్రిస్తున్న దృశ్యమిది. ఈ పోటీలో ఆమె తన దేశానికి తొలి స్వర్ణాన్ని అందించింది. ఇదే ఈవెంట్లో అదే దేశానికి చెందిన ఇరినా గెరాషెంకొ కాంస్యం దక్కించుకుంది. గత రెండేండ్లుగా రష్యా సాగిస్తున్న దారుణ మారణకాండకు బలౌతున్న ఉక్రెయిన్‌కు ఈ పతకాలు కాస్త స్వాంతననిస్తున్నాయి.