న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-17, 13-21, 18-21తో లిన్ చున్ యి(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. 68 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను 21-17తో కైవసం చేసుకున్న లక్ష్యసేన్.. ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు కోల్పోయాడు. పోరును దూకుడుగా ఆరంభించిన లక్ష్యసేన్..చైనీస్ తైపీ షట్లరకు దీటైన పోటీనిచ్చేందుకు ప్రయత్నించాడు.
మెరుగైన ఆధిక్యంతో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్న ఈ యువ షట్లర్ చున్ యి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. వరుసగా నాలుగో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు. సేన్‌ను మరింత ఒత్తిడిలోకి నెడుతూ పదునైన స్మాష్‌లు, నెట్‌గేమ్‌తో చున్ యి రెండో గేమ్‌ను 21-13తో దక్కించుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ ఎక్కడా వెనుకకు తగ్గని చున్యికి లక్ష్యసేన్ పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణపై ఆది నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో విపరీతమైన కాలుష్యంతో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్లు కనీసం ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండగా, తాజాగా టోర్నీకి వేదికైన ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో పక్షుల రెట్టలతో పలు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది.
హెచ్ఎస్ ప్రణయ్, లోహ్ కీన్ యు మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో పైన సీలింగ్ నుంచి పిట్టలు రెట్టలు వేయడంతో రెండుసార్లు ఆగిపోయింది. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్‌లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడటం విమర్శలకు తావు ఇస్తున్నది. లైవ్ కామెంట్రీలో అసలు విషయం బయటకు రాకపోయినా..మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ల వ్యాఖ్యలతో బహిర్గతమైంది.