Lakshya Sen : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) కొద్దిలో కాంస్యం చేజార్చుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. సెమీస్‌లో ఓడిన అతడు కాంస్య(Bronze) పోరులోనూ నిరాశపరిచాడు. అయితే.. మోచేతి గాయం లక్ష్యసేన్ మెడల్ ఆశల్నీ నాశనం చేసిందని యావత్ భారత్ సరిపెట్టుకుంది. కానీ, అతడి కోచ్ విమల్ కుమార్ (Vimal Kumar) మాత్రం ఒలింపిక్స్ ఓటమిని తేలికగా తీసుకోవడం లేదు. లక్ష్యసేన్ ఫిట్నెస్ పరంగా మెరుగవ్వాల్సిన సమయం వచ్చిందని, అప్పుడే అతడు మరిన్ని పతకాలు గెలుస్తాడని ఆయన అంటున్నాడు.
‘ఫిట్నెస్ పరంగా లక్ష్యసేన్ చాలా మెరుగవ్వాలి. ముఖ్యంగా వేగంపై, చివరిదాకా పోరాడడంపై అతడు దృష్టి పెట్టాలి. ఎందుకంటే అతడు ఆడే ఆట వేగానికి సంబంధించినది. అతడు ప్రత్యర్థిని నిలువరించడమే కాదు బలంగా షాట్లు కొట్టాలి’ అని విమల్ తెలిపాడు. అంతేకాదు లక్ష్యసేన్ తన బలహీనతల్ని సరి చేసుకోవాలని ఆయన చెప్పాడు. గాలి వీస్తున్నప్పుడు లక్ష్యసేన్ షటిల్‌ను కిందికి పెట్టాల్సి ఉంటుంది.
లక్ష్యసేన్‌తో కోచ్ విమల్ కుమార్
అంతేకాదు నెట్ దగ్గర కాక్‌ను పైకి, కిందకి ఆడడం ద్వారా ఎంతో శక్తి వృథా అవుతుంటుంది. అందుకని అతడు సూపర్ ఫిట్‌గా మారాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ చేజార్చుకోకుండా అతడు పట్టుదల ప్రదర్శించాలి అని విమల్ వెల్లడించాడు. లక్ష్యసేన్ త్వరలోనే ఫిట్నెస్ టెస్టుల కోసం ఆస్ట్రియా వెళ్లనున్నాడు. అక్కడి సాల్జ్‌బర్గ్(Salzburg)లోని రెడ్‌బుల్ అథ్లెట్ పర్మార్మెన్స్ సెంటర్లో అతడు రాటుదేలనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో అందరూ క్వార్టర్స్ ముందే చేతులెత్తేయగా లక్ష్యసేన్ ముందడుగు వేశాడు. విశ్వ క్రీడల పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక పతకం ఖాయం చేశాడని అంతా అనుకున్నారు.
అయితే.. డెన్మార్క్ ఆటగాడైన విక్టర్ అక్సెల్సెన్(Victor Axelsen) వేగానికి నిలవలేక కాంస్య పోరుకు సిద్ధమయ్యాడు. అసమాన ఆటతో ఆకట్టుకున్న అతడు సెమీస్ చేరిన తొలి భారత షట్లర్‌గా రికార్డుకెక్కాడు. అదే జోష్‌లో కంచు మోత మోగిస్తాడనుకుంటే మలేషియా షట్లర్ లీ జీ జియా (Lee Zii Jia) చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.