అమరావతి : విశ్రాంత ఐఏఎస్ అధికారి(Former IAS Officer) ఈఎఎస్ శర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పరిశ్రమల యజమానులతో సత్సంబంధాల కారణంగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల అచ్యుతాపురం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.
గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయని ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. 2014-19 వరకు మీ పాలనలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. పరవాడ ఫార్మా సెజ్లోనే 24 ప్రమాదాలు జరుగగా 21 మంది ప్రాణాలు కోల్పోయ్యారని వివరించారు. పరిశ్రమల్లో జరుగుతున్న దుర్ఘటనలోపై పరిశ్రమల యజమానులు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
ఎసైన్సియా ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి, గాయపడ్డ కార్మికులకు రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షలు పరిహారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ మార్పు రావాలని, కఠిన నిబంధనలను తీసుకురావాలని సూచించారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించవద్దని కోరారు.