హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అధికార దుర్వినియోగం యథేచ్చగా సాగుతున్నది. మనల్ని అడిగేది ఎవరూ అన్న రీతిలో కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ కొడుకు ఖుష్ అగర్వాల్ ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో హల్చల్ చేశాడు. తన దోస్తులతో కలిసి నానా హంగామా చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యుడైన సునీల్ అగర్వాల్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖుష్ అగర్వాల్ ఇష్టారాజ్యంగా స్టేడియంలో కలియతిరిగిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
వీఐపీ ట్రీట్మెంట్ను తలపిస్తూ కాంగ్రెస్ పార్టీ కండువాతో పాటు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో దోస్తులతో కలిసి స్టేడియం మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తున్న దృశ్యం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటికొచ్చింది. నిబంధనలను మొత్తం తుంగలో తొక్కుతూ సునీల్ కొడుకు ఖుష్ అగర్వాల్ స్టేడియంలో తన స్నేహితులను వెంటపెట్టుకుని తిరుగడం విమర్శలకు తావు ఇస్తున్నది. అంతటితో ఆగకుండా స్టేడియంలోని తన తండ్రి సునీల్ కుర్చీలోనే కూర్చుని రీల్స్ షూటింగ్ చేయడం అతని నిర్వాకాన్ని బయటపెట్టింది.
స్టార్ క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఇన్‌స్టా రీల్స్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. రీల్స్ హంగామాతో విమర్శలు వెల్లువెత్తగానే అప్రమత్తమైన ఖుష్ అగర్వాల్ వెంటనే డిలీట్ చేశాడు. ఇదిలా ఉంటే గతంలోనూ సునీల్ అగర్వాల్ అపెక్స్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న సమయంలోనూ ఖుష్ అగర్వాల్..హెచ్‌సీఏ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడినందుకు గాను వీరిపై ఎథిక్స్, అంబుడ్స్‌మన్‌కు అప్పట్లో కొందరు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈ ఉదంతం బయటకు రావడంతో సునీల్ అగర్వాల్ అధికార దుర్వినియోగం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.