కుమమొటొ (జపాన్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మళ్లీ గాడిలో పడాలని చూస్తున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, లక్ష్యసేన్ మరో సవాలుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి జపాన్ వేదికగా జరుగబోయే కుమమొటొ మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో ఈ ఇద్దరూ బరిలోకి దిగబోతున్నారు. ఒలింపిక్స్ అనంతరం కొద్దిరోజుల క్రితమే ఆర్కిటిక్ ఓపెన్‌తో రీఎంట్రీ ఇచ్చిన సింధు.. డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరినా కీలక పోరులో ఓడి నిరాశపరిచింది. మరోవైపు లక్ష్యసేన్ తొలి రౌండ్ మ్యాచ్‌లలోనే ఓడాడు. ఈ నేపథ్యంలో కుమమొటొ టోర్నీలో పుంజుకోవాలని సింధు, సేన్ పట్టుదలతో ఉన్నారు. కొత్త కోచ్ అనూప్ శ్రీధర్, కొరియా దిగ్గజం లీ స్యూన్ శిక్షణలో రాటుదేలుతున్న సింధు.. ఈ టోర్నీలో సత్తా చాటాలని ఆశిస్తోంది.