IPL 2024 | ఐపీఎల్-2024 టోర్నీలో శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫిల్ సాల్ట్ తో కలిసి బ్యాటింగ్ కు వచ్చిన ఓపెనర్ సునీల్ నారాయణ్ కేవలం 22 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 47 పరుగులు చేసి డాగర్ బౌలింగ్ లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెంకటేశ్ శ్రీఅయ్యర్ నిలకడగా ఆడుతుండగా 30 పరుగుల వద్ద ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు.
తర్వాత వచ్చిన సారధి శ్రేయస్ అయ్యర్ జత కలవడంతో వెంకటేశ్ అయ్యర్ చెలరేగి పోయాడు. కేవలం 30 బంతుల్లో నాలుగు సిక్స్ లు, మూడు ఫోర్లతో అర్థ సెంచరీ చేసుకుని యాష్ దయాల్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 19 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యాష్ దయాల్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ శాంక్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో నాలుగు సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 83 పరుగులతో నాటౌట్ గా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. కామెరున్ గ్రీన్ 33, గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగులు, దినేష్ కార్తీక్ 20 పరుగులు మినహా మిగతా వారు వెంటవెంటనే ఔటయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రే రస్సెల్ చెరో రెండు వికెట్లు, సునీల్ నారాయణ్ ఒక వికెట్ తీశారు.