KKR | కోల్‌కతా : ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. కీలకమైన రేసులో నిలువాలంటే సత్తాచాటాల్సిన సమయంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ సీజన్లో సొంతగడ్డపై కలవరపెడుతున్న వరుస ఓటములకు చెక్ పెడుతూ ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో కేకేఆర్ ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత రస్సెల్(25 బంతుల్లో 57 నాటౌట్, 4ఫోర్లు, 6 సిక్స్‌లు) విజృంభణకు తోడు రఘువంశీ(44), గుర్బాజ్(35) రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన రస్సెల్..రాయల్స్ బౌలర్లపై తన ప్రతాపాన్ని చూపాడు.
ఆదిలో క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న రస్సెల్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఆర్చర్, యుధ్వీర్సింగ్, తీక్షణ, పరాగ్ ఒక్కో వికెట్ తీశారు. 207 పరుగుల ఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 205/8 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 95, 6ఫోర్లు, 8సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో హెట్‌మైర్(29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్, ఫోర్, 2సిక్స్‌లు) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అలీ (2/43), రానా (2/41), వరుణ్ (2/32) రెండేసి వికెట్లు తీశారు. రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రస్సెల్ విజృంభణ : టాస్ గెలిచిన రహానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బ్యాటర్లు రాణించే ప్రయత్నం చేశారు. ఓపెనర్ సునీల్ నరైన్(11) విఫలమైనా..గుర్బాజ్, కెప్టెన్ రహానే(30) ఇన్నింగ్స్ నిర్మించారు. యుధ్వీర్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో గుర్బాజ్ రెండు ఫోర్లు కొడితే రహానే భారీ సిక్స్‌తో అలరించాడు. ఓవైపు సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూనే మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. తీక్షణ 8వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ ఆడబోయిన గుర్బాజ్..డీప్ మిడ్వికెట్లో హెట్‌మైర్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
గుర్బాజ్ తర్వాత వచ్చిన రఘువంశీ..రహానేకు జత కలిశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల రాక ఒకింత మందగించింది. పరాగ్ 13వ ఓవర్లో స్వీప్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహానే..కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రస్సెల్ ఇన్నింగ్స్ గతిని మార్చేశాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న రస్సెల్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. ఆకాశ్ వేసిన 16వ ఓవర్లో రస్సెల్ వరుసగా 4, 6, 4తో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆర్చర్‌ను 6, 4తో అరుసుకున్నాడు. తీక్షణ 18వ ఓవర్లోనైతే రస్సెల్ హ్యాట్రిక్ సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. ఇన్నింగ్స్ దూకుడు మీదున్న సమయంలో రఘవంశీ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 61 పరుగులకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సిక్స్‌తో రస్సెల్ 22 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. రస్సెల్ అండగా ఆఖర్లో రింకూసింగ్ 4, 6, 6 కొట్టడంతో కేకేఆర్ 200 మార్క్ అందుకుంది.
పరాగ్ పోరాడినా : 207 పరుగుల లక్ష్యఛేదనలో 7.5 ఓవర్లకు 71/5.. రాజస్థాన్ స్కోరిది. వైభవ్ సూర్యవంశీ(4), కునాల్‌సింగ్(0), జురెల్(0), హసరంగ(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసినట్లే అనుకున్నారు అంతా. కానీ ఇక్కడే కెప్టెన్ రియాన్ పరాగ్ ఒంటిపోరాటం చేశాడు. గెలుపుపై ఆశలు వదులుకున్న వేళ పరాగ్ అదిరిపోయే షాట్లతో కోల్‌కతాకు వణుకు తెప్పించాడు. హెట్‌మైర్ జతగా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భారీ షాట్లతో కదంతొక్కాడు.
ఈ క్రమంలో మొయిన్ అలీ 13వ ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టి రాజస్థాన్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. దిగ్గజ యువరాజ్‌సింగ్‌ను తలపిస్తూ పరాగ్ కొట్టిన సిక్స్‌లకు స్టేడియం హోరెత్తిపోయింది. అదే జోష్ కొనసాగిస్తూ వరుణ్ 14వ ఓవర్లో రెండో బంతిని సిక్స్‌గా మలువడంతో పరాగ్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టినట్లు అయ్యింది. పరాగ్, హెట్‌మైర్ ఉన్నంతసేపు రాయల్స్‌దే విజయం అనుకున్నారు. కానీ పది పరుగుల తేడాతో వీరిద్దరు ఔట్ కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో శుభమ్దూబే 6, 4, 6తో జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన దశలో రెండో రన్‌కు ప్రయత్నించిన ఆర్చర్ రనౌట్ కావడంతో కోల్‌కతా గెలుపు ఖరారైంది.
కోల్‌కతా: 20 ఓవర్లలో 206/4(రస్సెల్ 57 నాటౌట్, రఘువంశీ 44, పరాగ్ 1/21, యుధ్వీర్ 1/26),
రాజస్థాన్: 20 ఓవర్లలో 205/8( పరాగ్ 95, జైస్వాల్ 34, వరుణ్ 2/32, రానా 2/41)