లక్నో: ఒక్క రోజు వ్యవధిలోనే ఎంత మార్పు! శనివారం డబుల్ హెడర్‌లో బ్యాటర్ల భీకర మెరుపులతో రికార్డు స్కోర్లు నమోదైన ఐపీఎల్-19లో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య లక్నోలో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను అలరించింది. ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో ఈ సీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్లో కోల్‌కతానే విజయం వరించింది. కేకేఆర్ నిర్దేశించిన 156 పరుగుల స్వల్ప ఛేదనలో లక్నో సైతం నిర్ణీత ఓవర్లలో అంతే స్కోరు (155/8) చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లక్నో.. నరైన్ మాయ చేయడంతో ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసింది. రింకూ తొలి బంతికే ఫోర్ బాది కోల్‌కతాకు రెండో విజయాన్ని అందించాడు. మొదట మోహ్సిన్ ఖాన్ (5/23) పేస్‌కు దాసోహమైన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ప్రధాన బ్యాటర్లంతా నిరాశపరిచినా లోయరార్డర్లో రింకూ సింగ్ (51 బంతుల్లో 83 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) పోరాడి ఆ జట్టును పోటీలో నిలిపాడు.
లక్నో చేజేతులా..
వైభవ్ రెండో ఓవర్లో తొలి బంతికే ప్రమాదకర మిచెల్ మార్ష్ (2)ను ఔట్ చేసి లక్నోకు తొలి షాకివ్వగా కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి పరుగుల రాకకు అడ్డుకట్ట వేశారు. స్పిన్ ద్వయం నరైన్ (1/23), వరుణ్ (2/33) మాయతో మార్క్మ్ (29), పంత్ (42) వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నా పది ఓవర్లకు లక్నో స్కోరు 63/1 మాత్రమే. 11వ ఓవర్లో బంతినందుకున్న గ్రీన్.. మార్క్మ్‌న్రు ఔట్ చేయగా నరైన్, పంత్‌కు చెక్ పెట్టాడు. క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డ పూరన్ (9).. వరుణ్ ఓవర్లో నిష్క్రమించగా ముకుల్ చౌదరి (1), అనుకుల్ ఓవర్లో రింకూకు క్యాచ్ ఇవ్వడంతో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో లక్నో విజయానికి 58 రన్స్ అవసరమైన దశలో త్యాగి ఓవర్లో హిమ్మత్ (19), బదోని మూడు సిక్స్‌లు బాది జెయింట్స్‌ను పోటీలోకి తెచ్చారు. అయితే వరుణ్ మరుసటి ఓవర్లో బదోనిని ఔట్ చేయగా వైభవ్ 19వ ఓవర్లో లిండె (8) నిష్క్రమిండంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. త్యాగి విసిరిన ఆ ఓవర్లో రెండు నోబాల్స్‌తో పాటు ఆఖరి బంతికి షమీ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ టై అయింది.
మోహ్సిన్ పేస్‌కు దాసోహమై..
యువ పేసర్ మోహ్సిన్ వరుస ఓవర్లలో బెంబేలెత్తించడంతో కేకేఆర్ విలవిల్లాడింది. అతడి పేస్‌కు టిమ్ సీఫర్ట్ డకౌట్ అవగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అజింక్యా రహానే (10), రోమన్ పావెల్ (1) వికెట్లను కోల్పోయి నైట్‌రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. తన మొదటి స్పెల్‌లో మూడు ఓవర్లు వేసిన మోహ్సిన్.. 15 పరుగులే ఇచ్చి పర్యాటక జట్టు వెన్ను విరిచాడు. ప్రిన్స్ బౌలింగ్‌లో రఘువంశీ (9) అబ్స్ట్రక్టింగ్ ఫీల్డ్‌గా ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో రింకూ, కామెరూన్ గ్రీన్ (34) కోల్‌కతాను ఆదుకునే యత్నం చేశారు. ఇద్దరూ ఐదో వికెట్‌కు 28 బంతుల్లోనే 42 పరుగులు జోడించి క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రెండో స్పెల్‌కు వచ్చిన మోహ్సిన్.. మూడు బంతుల వ్యవధిలో గ్రీన్, అనుకుల్‌ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇదే తొలి ఫైఫర్. రమణ్‌దీప్ సింగ్ (6)ను లిండె వెనక్కి పంపడంతో 15 ఓవర్లకు కేకేఆర్ 93/7గా నిలిచింది. కానీ అప్పటికే 31 బంతులాడి 33 రన్స్ చేసిన రింకూ 18వ ఓవర్లో గేర్ మార్చాడు. షమీ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన అతడు.. దిగ్వేశ్ విసిరిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాది 26 రన్స్ పిండుకోవడంతో కోల్‌కతాకు పోరాడగలిగే స్కోరును సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లకు 155/7 (రింకూ 83*, గ్రీన్ 34, మోహ్సిన్ 5/23, లిండె 1/18); లక్నో: 20 ఓవర్లకు 155/8 (పంత్ 42, మార్క్మ్ 31, వైభవ్ 2/24, వరుణ్ 2/33)