ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. సొంత గడ్డపై రాజస్థాన్‌పై విజయం తర్వాత హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమివైపు నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 120 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్, అభిషేక్‌శర్మ, ఇషాన్‌కిషన్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. తొలుత వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ అర్ధసెంచరీలతో 200 స్కోరు అందుకున్న కోల్‌కతా..సమిష్టి ప్రదర్శనతో రైజర్స్‌ను కట్టడి చేసింది.
SRH | కోల్‌కతా: నిరుటి సీజన్ టైటిల్ పోరు ప్రత్యర్థులు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. గురువారం చారిత్రక ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 80 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యఛేదనలో రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. క్లాసెన్(33), కమిందు మెండిస్(27) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. వైభవ్ ఆరోరా(3/29), వరుణ్ చక్రవర్తి(3/22) మూడేసి వికెట్లతో విజృంభించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 60, 7ఫోర్లు, 3సిక్స్‌లు), రఘువంశీ(32 బంతుల్లో 50, 5ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. మెండిస్(1/4), అన్సారీ(1/25) ఒక్కో వికెట్ తీశారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బ్యాటర్లు క్యాచ్‌ల ద్వారా పెవిలియన్ చేరారు. వైభవ్ అరోరాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్..కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ రైజర్స్ బౌలర్లు 16 పరుగులకే కోల్‌కతా ఓపెనర్లు డికాక్(1), నరైన్(7) ఔట్ చేసి మెరుగైన శుభారంభం అందజేశారు. అయితే రఘువంశీ, కెప్టెన్ రహానే(38) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. ముఖ్యంగా రఘువంశీ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో రహానే చక్కని సహకారం అందించాడు. రహానేను అన్సారీ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రఘువంశీ కూడా వెంటనే ఔట్ కావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ఈ తరుణంలో రింకూసింగ్(32 నాటౌట్), అయ్యర్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చారు. వీరిద్దరు రైజర్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ బౌండరీలతో వీరవిహారం చేశారు. అయ్యర్ దొరికిన బౌలర్‌ను దొరికినట్లు బాదడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. వీరిద్దరి బ్యాటింగ్‌తో ఆఖరి 5 ఓవర్లలో 78 పరుగులు వచ్చాయి.
లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న హెడ్, అభిషేక్ మరోమారు నిరాశపరిచారు. హెడ్‌ను వైభవ్ ఔట్ చేస్తే..అభిషేక్‌ను హర్షిత్ రానా సాగనంపాడు. దీంతో 9 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో సెంచరీ మినహాయిస్తే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ఇషాన్ కిషన్ మరోమారు సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమయ్యాడు. వైభవ్ బౌలింగ్‌లో రహానే సూపర్ క్యాచ్ ద్వారా కిషన్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. నితీశ్‌కుమార్(19), మెండిస్, క్లాసెన్ అంతోఇంతో బ్యాట్లు ఝులిపించినా లాభం లేకపోయింది.
కోల్‌కతా:20 ఓవర్లలో 200/6(అయ్యర్ 60, రఘువంశీ 50, మెండిస్ 1/5, అన్సారీ 1/25),
హైదరాబాద్: 16.4 ఓవర్లలో 120 ఆలౌట్(క్లాసెన్ 33, మెండిస్ 27, వరుణ్ 3/22, వైభవ్ 3/29)