సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీ సత్తాచాటలేకపోయింది. గత మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక విజయం సాధించిన సన్‌రైజర్స్.. ఉప్పల్‌లో కోల్‌కతాపై అదే జోరు కొనసాగించలేకపోయింది. బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి ప్రత్యర్థిని ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసినా.. ఛేదనలో బ్యాటర్లు తడబడటంతో హైదరాబాద్‌కు మరో పరాజయం తప్పలేదు!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో సన్‌రైజర్స్ ఆరో పరాజయం మూటగట్టుకుంది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. రస్సెల్ (24; ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జాసన్ రాయ్ (20) పర్వాలేదనిపించారు. రహ్మానుల్లా గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7) విఫలమయ్యారు. రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్మ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 36; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో రైజర్స్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. మూడు రన్స్ మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. కోల్‌కతా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చక్రవర్తికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గెలుపు గీత దాటలేక
ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ (18) మూడో ఓవర్లో ఔట్ కాగా.. అభిషేక్ (9) అతడిని అనుసరించాడు. సూపర్ షాట్లతో చెలరేగిన రాహుల్ త్రిపాఠి (20) ఉన్నంత సేపు మైదానాన్ని హోరెత్తించగా.. బ్రూక్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్లాసెన్‌తో కలిసి మార్క్మ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దీంతో లక్ష్యం కరిగిపోగా.. వీరిద్దరు ఔటవడంతో రైజర్స్ మరోసారి కష్టాల్లో పడింది.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 171/9 (రింకూ సింగ్ 46, నితీశ్ రాణా 42; జాన్సెన్ 2/24, నటరాజన్ 2/30),
హైదరాబాద్: 166/8 (మార్క్మ్ 41, క్లాసెన్ 36; శార్దూల్ 2/23, వైభవ్ 2/32).